: ‘పెద్దనోట్ల రద్దు’తో వచ్చిన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయాలు
బ్యాంకుల్లో నగదు డిపాజిట్ పరిమితి లేదని, అంతేగాక, బ్యాంకుల్లో రోజుకు ఎన్నిసార్లైనా జమ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ రోజు తెలిపారు. తాజా పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో వస్తోన్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి రూ.500 నోట్లను తీసుకొచ్చినట్లు శక్తికాంతదాస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మొత్తం 2.5 లక్షల పోస్టాఫీసులు, బ్యాంకు శాఖల్లో నగదు అందుబాటులో ఉందని చెప్పారు. అన్ని ఏటీఎంలలో డబ్బు రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పాత నోట్ల మార్పిడిని ప్రారంభించినట్లు చెప్పారు. నగదు నిల్వలు, మార్పిడిపై తాము ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటీఎంల వద్ద మరింత భద్రత పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.