: అక్రమార్కులు ఇక బంగారాన్నీ కొనలేరు!
పెద్ద నోట్లను రద్దు చేయగానే బ్లాక్ మనీని దాచుకున్న అక్రమార్కులు, తమ డబ్బును తెల్లధనంగా మార్చుకునేందుకు వేసిన తొలి అడుగు బంగారం కొనుగోలు చేయడం. రూ. 30 వేల వరకూ ఉన్న పది గ్రాముల బంగారాన్ని రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకూ పెట్టి కొనుగోలు చేశారు. ఆభరణాల వ్యాపారులు సైతం తాము లాభపడతామన్న ఉద్దేశంతో ఈ అక్రమ దందాకు మద్దతిచ్చి బ్లాక్ మనీని వైట్ చేయడంలో తమ వంతు సాయం చేశారు కూడా. అయితే ఇక ఇప్పుడు ఈ దందాకు చెక్ పడనుంది. ఏ జ్యూయెలరీ వ్యాపారైనా రేపటిలోగా బ్యాంకులో జమచేసే పాత కరెన్సీని మాత్రమే కేంద్రం లెక్కలోకి తీసుకుంటుంది. అంటే, ఎల్లుండి నుంచి ఆభరణాల వ్యాపారులు ఎలాంటి పాత కరెన్సీని వ్యాపార ఆదాయంగా చూపించే వీలు లేదు. దీనికితోడు అమ్మిన ఆభరణాలన్నింటినీ రూ. 2 లక్షల కన్నా తక్కువగా బిల్లులను జ్యూయెలర్స్ వేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి రూ. 2 లక్షలు దాటిన బంగారం అమ్మకాలకు పాన్ కార్డు తప్పనిసరి. పాన్ నిబంధన నుంచి తప్పించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక ఒక్క ముంబైలోనే గడచిన ఐదు రోజుల్లో 250 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 18 టన్నుల వరకూ బంగారం అమ్మకాలు సాగినట్టు సమాచారం. ఇక రేపటి నుంచి ఈ అవకాశం అటు అక్రమార్కులకు, ఇటు ఆభరణాల వ్యాపారులకు ఉండబోదు.