: సైనికులు చేస్తున్న అటువంటి పనిని మనం చేయలేమా?: బాబా రాందేవ్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు రాజకీయ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ స్పందించారు. మన వ్యవస్థకు పట్టిన చీడను వదిలించే దిశగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలంటూ పిలుపునిచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేయడం అవినీతి, నల్లధనం, తీవ్రవాదం, నకిలీ నోట్ల వ్యాపారాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన చెప్పారు. మేదంతా-మెడిసిటీ నిర్వహించిన ఇంటర్నేషనల్ కారొనరీ కాంగ్రెస్ లో ప్రసంగిస్తూ, ఆయన ఈ విధంగా స్పందించారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రధానిని కొందరు విమర్శిస్తున్నారని... విమర్శించడం మానుకోవాలని, వ్యవస్థ బాగుపడటానికి ప్రజలంతా సహకరించాలని బాబా రాందేవ్ సూచించారు. యుద్ధ సమయంలో జవాన్లు తిండి, తిప్పలు కూడా లేకుండా పోరాడుతుంటారని... వారాల కొద్దీ నిద్ర లేకుండా గడుపుతారని... ఇప్పుడు మనం ఆ పని చేయలేమా? అంటూ ప్రశ్నించారు. దేశ సంక్షేమం కోసం కొన్ని రోజులు ఇబ్బందులను అనుభవించలేమా? అని అన్నారు. ఎంతో ఒత్తిడిలో కూడా ప్రధాని గొప్ప నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నారని ప్రశంసించారు.