: ఎస్పీ నేతకు నమస్కారం చేయలేదని.. మాజీ జవానును చితకబాదిన కార్యకర్తలు


సమాజ్‌వాదీ పార్టీ నేతకు నమస్కారం పెట్టకపోవడమే ఆ మాజీ జవాను చేసిన నేరమైంది. ‘ఆయనకే నమస్కారం పెట్టవా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అతడిపై దాడిచేసి చితగ్గొట్టారు. బాధితుడి కథనం ప్రకారం.. గణేశ్ కుమార్ శుక్లా 22 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ లోని ఓ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీకే త్రిపాఠీ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వచ్చారు. ఆయనకు నమస్కారం పెట్టాల్సిందిగా అనుచరులు గణేశ్ కుమార్‌ను కోరారు. దీనికి ఆయన నిరాకరించారు. తాను త్రివర్ణ పతాకానికి తప్ప మరెవరికీ నమస్కారం చేయనని తేల్చి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన ఎస్పీ నేత అనుచరులు, కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ‘‘ఆయన చాలా చెబుతున్నాడు. ముందు నాలుగు తగిలించండి’’ అంటూ అందరూ కలిసి అతడిపై దాడిచేశారు. దీంతో గణేశ్ తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు నేతకు వత్తాసు పలుకుతూ తిరిగి గణేశ్‌పైనే కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన గణేశ్ తన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లకు తెలిపారు. తనకు జరిగిన అన్యాయన్ని భరించలేకపోతున్నానని, తన పోరాటానికి మద్దతు పలకాలని వారిని అభ్యర్థించారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడిపై రాజకీయ నేత దాడికి పాల్పడడాన్ని సైనికులు ఖండిస్తున్నారు. దేశ సేవ కోసం పనిచేసిన, పనిస్తున్న వారికి దేశంలో లభిస్తున్న గౌరవానికి ఇదో మచ్చుతునక అని విమర్శిస్తున్నారు. గణేశ్‌కు చంద్రుడిని తెచ్చి ఇవ్వమని తాము అడగడం లేదని, పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తెచ్చి ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News