: కొంపముంచిన ఫేస్‌బుక్ ఛాటింగ్.. నేవీ ఆఫీసర్‌ని నిలువునా ముంచేసిన వగలాడి!
ఖాళీ సమయాల్లో ఫేస్‌బుక్ ఛాటింగ్‌తో కాలక్షేపం చేసే విశాఖపట్నంలోని నేవీ ఆఫీసర్ హర్షుక్‌ని అదే ఫేస్‌బుక్‌లో మాయమాటలు చెప్పి ఓ అమ్మాయి మోసం చేసింది. ఛాటింగ్‌లో హలో అంటూ పరిచయమైన అమ్మాయితో కొన్ని రోజులుగా ఛాటింగ్ చేస్తున్నాడు హర్షుక్. తనకు నీతో మాట్లాడాలని ఉందని చెప్పి, ఫోన్ నెంబర్ అడిగింది. వెంటనే అతను నెంబరు ఇచ్చాడు. అయితే, అదే సమయానికి తన వద్ద ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందని తనకు ఆన్‌లైన్‌లో 50 రూపాయలు రీఛార్జ్ చేయమని అడిగింది. తనకు ఆన్‌లైన్ ద్వారా రీఛార్జ్ చేయడం రాదని హర్షుక్ ఆ అమ్మాయితో చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి ఓ లింకు పంపించింది. అందులో ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చని చెప్పింది. ఆ అమ్మాయి పంపిన లింకుపై క్లిక్ చేసి యాభై రూపాయలు రీఛార్జ్ చేసిన హర్షుక్ కి వెంటనే ఓ మెసేజ్ వచ్చింది. తన బ్యాంకు అకౌంట్ నుంచి 50 వేల రూపాయలు కట్ అయ్యాయంటూ వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాడు. వెంటనే హర్షుక్ స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకి బదిలీ చేశారు. మాయలేడీ పంపింది ఒరిజినల్ లింక్ కాదని పోలీసులు తెలిపారు. ఆ లింక్ ఓపెన్ చేసి తన బ్యాంకు అకౌంట్ వివరాలు టైప్ చేయగానే అవతలి వైపు నుంచి హర్షుక్ అకౌంట్ ను ఉపయోగించి ఆ మాయలేడి క్షణాల్లో రెండు మొబైల్ ఫోన్లు కొనేసిందని పేర్కొన్నారు. బాగా చదువుకొని ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి కూడా మోసపోయాడని, ఇటువంటి వారిని నమ్మకూడదని పోలీసులు చెప్పారు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో పరిచయమవుతున్న సైబర్ నేరగాళ్లు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఫేస్‌బుక్ లో అవతలి వారితో ఛాటింగ్ చేస్తూ హలో అనుకునే వరకే ఉండాలని, అపరిచితులతో పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అమ్మాయిల పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు. ఓటీపీ, ఏటీఎం కార్డు సీవీవీ, పిన్ నెంబర్లను అస్సలు చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు.