: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే సాధిస్తా.. రాజీపడేది లేదు: మరోమారు స్పష్టం చేసిన చంద్రబాబు


ప్రత్యేక హోదా విషయంలో తాను కేంద్రంతో రాజీ పడలేదని, హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తుండడం వల్లే అందుకు అంగీకరించినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారని, అయితే కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే సాధిస్తాను తప్ప రాజీ పడబోనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. కాకివీధి నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటరు మేర పాదయాత్ర చేశారు. ప్రజలు పూలు జల్లుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్బంగా కోడి రామ్మూర్తి స్టేడియంలో డ్వాక్రా మహిళల బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో తాను రాజీపడ్డానని కొందరు విమర్శిస్తున్నారని, అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తుండడంతోనే అంగీకరించారనన్నారు. 14వ ఆర్థిక సంఘం వేరు, ప్యాకేజీ వేరు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందేలా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రద్దు మంచిదేనని ప్రజలు కూడా చెబుతున్నారని అన్నారు. చిల్లర కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2 వేల నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ విషయమై కేంద్రంతో మాట్లాడతానని, చిల్లర సమస్య పెరగడంతో అవసరమైన చిల్లర అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News