: మోదీగారూ... ఇదెలా సాధ్యమో చెప్పరూ?: మళ్లీ నిలదీసిన కేజ్రీవాల్
నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిలదీశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలను ఇంతదారుణంగా మోసం చేయడం అవసరమా? అని అడిగారు. అంబానీలు, అదానీలు, గుజరాత్ వ్యాపారవర్గాలు, బీజేపీ నేతలకు కొత్త నోట్ల విషయం ముందే తెలుసని ఆయన చెప్పారు. దీంతోనే దేశంలోని బ్యాంకుల్లో గత రెండు నెలల్లో భారీ ఎత్తున డిపాజిట్లు జరిగాయని అన్నారు. ఈ డిపాజిట్లు ఎక్కడ జరిగాయో వెల్లడిస్తే ఏ ప్రాంత వాసులకు ఈ నోట్ల సంగతి ముందే తెలిసిందో ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాత నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు ఈ నెల 8న ప్రకటించారు. వాటిని రెండు రోజుల తరువాత అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంటే ఈ నెల 10 నుంచి కొత్త నోట్లు మార్కెట్ లో వినియోగానికి వచ్చాయి. అలాంటప్పుడు ఈ నెల 5న పశ్చిమబెంగాల్ కు చెందిన బీజేపీ నేత కట్టల కొద్దీ డబ్బుతో ఫోటో దిగి ట్విట్టర్ లో ఎలా పెట్టగలిగాడని ఆయన నిలదీశారు. ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు తమవద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిని పక్కన పెట్టినా...నోట్ల రద్దును ప్రకటించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, బ్యాంకుల్లో నల్లధనం డిపాజిట్ చేస్తే, అందులో 30 శాతం ట్యాక్సుగాను, 200 శాతం పెనాల్టీగాను విధిస్తామంటున్నారు. ఈ నిబంధన ఎందుకు తెచ్చారు? అని ఆయన నిలదీశారు. ఈ నిబంధనతో ఒక్క రూపాయి నల్లధనం అయినా బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుందా? అని ఆయన నిలదీశారు. ప్రజలను మభ్యపెడుతూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తప్ప మరింకెందుకూ పనికిరాదని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా దీని వెనుక భారీ కుంభకోణం దాగుందని ఆయన చెప్పారు. ఇప్పటికే బీజేపీ నేతల, వారి అనుచరులకు చేరిన కరెన్సీతో దళారీ వ్యవస్థ పుంజుకుందని ఆయన తెలిపారు. నల్లధనాన్ని తెల్లగా మారుస్తామంటూ ఒక వర్గం కొత్తగా పుట్టుకొచ్చిందని, వీరంతా ఎవరని ఆయన నిలదీశారు.