: మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంలో ఇదే చాలా పెద్ద తప్పు!: ఆర్థిక రంగ నిపుణులు
నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ తీసుకున్న నిర్ణయంలోని ఓ తప్పు మోదీ ప్రతిష్ఠను మసకబారుస్తుందని ఆర్ధికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దును దేశంలోని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని, అదే సమయంలో కొత్త 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టడం పెద్ద తప్పిదమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి మరింత ఖర్చు పెరగడంతో పాటు, నల్లకుబేరులు మరింత పెరుగుతారని వారు పేర్కొన్నారు. గతంలో నాలుగు 500, రెండు వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో ఒక్క నోటు దాచుకోవడం పెద్ద కష్టం కాదని వారు చెబుతున్నారు. నల్లధనం అంటే కేవలం నగదు మాత్రమే కాదని, కొంతమంది చేతుల్లోనే ఉన్న భూములు, బంగారం ఇలా చాలా అంశాలు పరిగణనలోకి వస్తాయని వారు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అద్భుతమైందని, గతంలో ఐదువేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధన నియంత్రణ సులువైందని, ప్రజల జీవనశైలి మారిందని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు చట్టాలను మార్చి, పన్నుల విధానంలో సమీక్షలు చేసి, వీలైనంత ఎక్కువ మందిని ట్యాక్స్ చెల్లింపుల విధానంలోకి తీసుకొచ్చి ఉంటే బాగుండేదని వారు పేర్కొన్నారు. రెండు వేల నోటుకు బదులుగా రెండు వందల నోటు తెచ్చి, ఆన్ లైన్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించి ఉంటే మరింత బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. కొత్త ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుందని, ఈ ఖర్చును అరికట్టి, పెద్దనోట్లను పూర్తిగా రద్దు చేసి ఉంటే ఈ నిర్ణయం భేషుగ్గా ఉండేదని, మోదీ ఆశించిన లక్ష్యాలు నెరవేరి ఉండేవని వారు పేర్కొన్నారు.