: భారత ప్రజాస్వామ్యం మేడిపండు చందం?
మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లు మేడిపండు చూడడానికి గొప్పగా ఉంటుంది. లోపలకు వెళితేనే తెలుస్తుంది. అలానే ప్రజాస్వామ్యం అనే పదం వినపడగానే ముందుగా గుర్తుకొచ్చేది భారత దేశం పేరే. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తినందుకుంటోంది. కానీ వాస్తవ చిత్రం వేరు. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచీలో మాత్రం భారత్ స్థానం 38గా ఉంది.
165దేశాలతో ఎకనమిస్ట్ మేగజైన్ రూపొందించిన ప్రజాస్వామ్య సూచీ 2012లో ఈ విషయం వెల్లడైంది. ఎన్నికల ప్రక్రియ, బహుళవాదం అనే అంశాల్లో భారత స్కోరు 9.58గా, పౌర స్వేచ్ఛలో 9.41గా ఉంది. ప్రజాస్వామ్య సూచీలో ప్రథమ స్థానంలో ఉన్నది చిన్న దేశమైన నార్వే(9.93). స్వీడన్ (9.73) ఐస్ లాండ్(9.65) రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. భారత్ లో పలు సమస్యలున్నా, ఇప్పటికీ ప్రపంచంలో ప్రముఖ ప్రజాస్వామ్య దేశమేనని సూచీ పేర్కొంది. ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ విధానం అమలులో ఇప్పటికీ అనేక సమస్యలున్నట్లు పేర్కొంది.