: ఇప్పటి వరకు రూ. 45 వేల కోట్లు జమ అయ్యాయి: మోదీ
ఇన్ని రోజులూ దోపిడీకి గురైన సొమ్మును ఇప్పుడు రాబడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు రూ. 45 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని చెప్పారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్న వారందరికీ శాల్యూట్ చేస్తున్నానని తెలిపారు. జపాన్ లోని కోబె నగరంలో ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని... పన్నులు ఎగ్గొట్టే వారిని మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. నోట్ల రద్దు అంశాన్ని చాలా రహస్యంగా ఉంచామని చెప్పారు. గంగానదిలో పుణ్యం కోసం కూడా ఏ రోజూ రూపాయి వేయనివారు... ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లను గంగలో విసిరేస్తున్నారని అన్నారు. కోబె నగరంతో భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయని... గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు కోబె నగరం ఆదుకుందని మోదీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లు కూడా ప్రశంసించాయని తెలిపారు.