: సర్జికల్ స్ట్రయిక్స్ సామాన్యులపై కాదు... స్విస్ బ్యాంకులపై చేయండి: శివసేన
పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ శివసేన మండిపడింది. వేలాది మంది స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్నారని... అందువల్ల సర్జికల్ స్ట్రయిక్స్ స్విస్ బ్యాంకులపై చేయాలని, సామాన్యులపై కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ప్రజలు మనకు ఓటు వేశారని... ఆ విషయాన్ని మర్చిపోతే, ప్రజలే మనపై సర్జికల్ దాడులు చేస్తారని హెచ్చరించారు. తరచుగా మన్ కీ బాత్ నిర్వహించే ప్రధాని మోదీ... ఇప్పుడు ధన్ కీ బాత్ ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకులపై సర్జికల్ దాడులు జరిపితేనే మోదీ చేపడుతున్న చర్యలకు బలం పెరుగుతుందని చెప్పారు. ప్రజల సొంత డబ్బుతోనే వారిని చిత్ర హింసలు పెడుతున్నట్టు ఉందని విమర్శించారు. ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా జనాల వద్ద డబ్బు లేదని... పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.