: మొరాదాబాద్ వాసులను బెంబేలెత్తించిన పుకార్లు... కేజీలకు కేజీల ఉప్పు కొనేశారు!
ఒక్క పుకారు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ వాసులను బెంబేలెత్తించింది. దీంతో మొరాదాబాద్ వాసులు ఉప్పును కేజీలకు కేజీలు కొనుగోళ్లు చేయడంతో అక్కడ చిటికెలో ఉప్పు అయిపోయింది. ఇంతకీ ఉప్పు ఇంతలా కొనడానికి కారణమేంటంటే... 500, 1000 రూపాయల నోట్ల రద్దు కారణంగా దేశంలోని వివిధ వస్తువుల ధరలు పెరగనున్నాయని, అందులో ప్రధానంగా ఉప్పు ధర కేజీ నాలుగు వందలకు చేరుకుందని, వివిధ ప్రాంతాల్లో 400 రూపాయలకు ఉప్పును అమ్ముతున్నారని పుకార్లు బయల్దేరాయి. దీంతో బెంబేలెత్తిపోయిన మొరాదాబాద్ వాసులు దుకాణాలపై దండయాత్రకు దిగారు. ఒక్కసారిగా భారీ ఎత్తున వినియోగదారులు ఉప్పు కొంటుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రద్దీ తట్టుకోలేక దుకాణదారులు కంగారుపడిపోయారు. కొందరు వ్యాపారులైతే దుకాణాలు కూడా మూసేసుకున్నారు. అయితే ఇవన్నీ పుకార్లని, ఈ పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజలు నమ్మకపోవడం విశేషం.