: ‘కోట్లు అలా వేసుకున్నారేంటి?’ అని విద్యార్థిని ప్రశ్నించిన పవన్ కల్యాణ్
అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇష్టాగోష్ఠిగా ఈరోజు ఉదయం మాట్లాడటం విదితమే. పలువురు విద్యార్థినీ విద్యార్థులు ఆయనకు ప్రశ్నలు సంధించడంతో, తనదైన శైలిలో పవన్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో శ్రీజ అనే విద్యార్థిని కూడా పవన్ పై ఒక ప్రశ్న సంధించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, పవర్ స్టార్ ఆ విద్యార్థిని వైపు చూస్తూ, ‘మీరు ఏం డ్రెస్ వేసుకున్నారు? కోట్లు అలా వేసుకున్నారేంటి?’ అని సరదాగా ప్రశ్నించారు. దీంతో, విద్యార్థుల నవ్వులు, కేకలతో హోరెత్తింది. దీంతో, పవన్ ‘హే ఆగండి’ అని వారికి చెప్పడం, ఆ విద్యార్థిని మాట్లాడనీయమని అనడం జరిగింది. పవన్ కు శ్రీజ సమాధానమిస్తూ, తాము ఎంబీఏ విద్యార్థులమని, అందుకే, ఈ కోట్లు ధరించామని చెప్పుకొచ్చింది.