: ఈ విధానం మంచిది కాదు... పరిస్థితి 24/7 లా తయారైంది: స్టీఫెన్ ఫ్లెమింగ్
జెంటిల్మన్ గేమ్ రూపుమార్చుకోవడంపై న్యూజిలాండ్ జట్టు మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వన్డేలు, టీ20 మ్యాచ్ ల రంగప్రవేశంతో టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితి మారాలని అంటూ గతంలో తన గొంతు వినిపించిన ఫ్లెమింగ్... ఇటీవల కాలంలో క్రికెట్ మ్యాచ్లు విపరీతంగా పెరిగిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. క్రికెట్ టెలివిజన్ లో 24/7 (నిరంతరం) ప్రసారమయ్యే డ్రామాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆటకు చేటుచేస్తుందని హెచ్చరించాడు. క్రికెట్ ఒక వినోదాత్మకమైన క్రీడ అని, దానిని ఆ స్థాయిలోనే ఉంచాలి కానీ... లెక్కకు మిక్కిలి మ్యాచ్ లు నిర్వహిస్తే కనుక గేమ్ లోని మజాను దెబ్బతీస్తుందని హెచ్చరించాడు. మరొకవైపు టీ 20 లీగ్ లు మరింత పెరగడంపై ఫ్లెమింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. డబ్బుపై ఉన్న మోజు కొద్దీ క్రికెటర్లు ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకే బాగా ఆసక్తి కనబరచడం కూడా క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తుందని తెలిపాడు. ప్రస్తుతానికి దీనికి సరైన పరిష్కారం లేకపోయినా, భవిష్యత్ లో మ్యాచ్ల నిర్వహణను కుదిస్తే ఆటకు ప్రాధాన్యత, ఆదరణ పెరుగుతాయని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.