: ఒబామాకు ట్రంప్ ప్రశంసలు.. నిరసనకారులకు అక్షింతలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం, తన మద్దతుదారులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని విన్నవారంతా ఆశ్చర్యపోయారు. తన శైలికి విరుద్ధంగా ఎంతో కూల్ గా, ఎలాంటి విమర్శలు లేకుండా ఆయన ప్రసంగం కొనసాగింది. అయితే, ఆయన గెలుపు హిల్లరీ మద్దతుదారులకు రుచించడం లేదు. దీంతో, కొన్ని చోట్ల ట్రంప్ కు వ్యతిరేకంగా వారు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని చెప్పారు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారంతా డబ్బు తీసుకుని ఈ పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీరంతా ప్రొఫెషనల్ నిరసనకారులని ఆరోపించారు. దీని వెనుక కచ్చితంగా మీడియా పాత్ర ఉందని విమర్శించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. మరోవైపు అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తాను ఊహించిన దానికంటే ఒబామా గొప్పవారని కితాబిచ్చారు. ఆయనతో కొంతసేపు గడపడం గొప్ప అనుభవం అని తెలిపారు. తన భార్య మెలానియాకు ఒబామా భార్య మిషెల్లీ బాగా నచ్చారంటూ ట్విట్టర్లో తెలిపారు.