: నిజంగా బాధపడుతున్నారా? ఎందుకంత బాధ?: ‘పెద్ద నోట్ల రద్దు’ విమర్శలపై అమిత్ షా
దేశంలో నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల నుంచి వస్తోన్న విమర్శలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్ద నోట్లు వెనక్కి తీసుకుంటే ములాయం, మాయావతిలకు ఎందుకంత బాధ? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు నిజంగా ప్రజల కోసమే బాధపడుతున్నారా? అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం ఉగ్రవాదులు, నక్సలైట్లు, హవాలా ఆపరేటర్స్, నకిలీ నగదును ప్రోత్సహించే వారికి షాకేనని చెప్పారు. నోట్ల రద్దుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడి జరుగుతోందని అమిత్ షా చెప్పారు. ప్రధాని నిర్ణయం నల్లధనం దాచుకునేవారికి ఉగ్రవాదులకు షాకిచ్చిందని అన్నారు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో సేవలందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తమకూ బాధ కలిగిస్తున్నాయని అన్నారు. త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని చెప్పారు.