: గ్రూప్-2 పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన.. తీవ్ర నిరాశతో వెనక్కి తిరిగిన పలువురు అభ్యర్థులు
తెలంగాణలో 1032 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న గ్రూప్-2 పరీక్ష కొనసాగుతోంది. అయితే, ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పేపర్-1 (జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీస్) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. ప్రభుత్వం విధించిన ఒక్క నిమిషం నిబంధనతో నష్టపోయామని వాపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చామని తమను అనుమతించాలని పరీక్ష కేంద్రాల సిబ్బందిని అభ్యర్థులు వేడుకున్నారు. అయినప్పటికీ వారిని పరీక్ష హాలులోకి అనుమతించలేదు. మరికొన్ని చోట్ల గ్రూప్-2 పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. తొలి పేపర్‌కు హాజరు కాని అభ్యర్థులను మిగిలిన పేపర్లకు కూడా అనుమతించబోరనే విషయం తెలిసిందే.