: ఎన్నికల రాష్ట్రాల్లో నేతల కొత్త రూటు... తరువాత ఓటేయండని ఇప్పుడే డబ్బుల పంపిణీ!


పాత కరెన్సీని రద్దు చేస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నేతలు, తమ వద్ద ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న నల్లధనాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు తరువాత ఓటేయాలని చెబుతూ కరెన్సీని పంచుతున్నారు. ఈ డబ్బును తీసుకువెళ్లి బ్యాంకుల్లో మార్చుకుని ఖర్చు పెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో తమకు ఓటు వేయాలని ఇప్పుడే అభ్యర్థిస్తున్నారు. గత రెండు రోజులుగా యూపీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ తంతు కనిపిస్తోంది. వాస్తవానికి పాత కరెన్సీని రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తరువాత, ఎన్నికల రాష్ట్రాల్లోని నేతలకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. వీరంతా కోట్ల కొద్దీ డబ్బును ఎన్నికల్లో వెచ్చించేందుకు సిద్ధం చేసుకుని ఉండటమే ఇందుకు కారణం. ఒకరోజుల్లా వారిలో ఆందోళన నెలకొన్నా, ఆపై సర్దుకుని, తమ వద్ద ఉన్న డబ్బంతా అనుయాయులకు పంపి, వారి నుంచి ఓటర్లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరాఖండ్, గోవాల్లో సైతం ఓటర్లకు ఇప్పుడే డబ్బులు పంచుతున్నట్టు సమాచారం. తమ వద్ద ఉన్న డబ్బు ఎన్నికల నాటికి ఎలానూ పనికిరాదని, దాన్ని తాము బయటకు చూపలేమని భావిస్తున్న నేతలు, డబ్బును నీళ్లలా పంచే పనిలో నిమగ్నమై ఉన్నారు. గ్రామాల ఇన్ చార్జులు, పార్టీ నేతలు, సర్పంచ్ ల ద్వారా ఈ డబ్బు పంపిణీ జోరుగా సాగుతోంది. ఇక ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఓటరు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల వరకూ డబ్బిచ్చిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓటేస్తాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే!

  • Loading...

More Telugu News