: పవన్ కల్యాణ్ మాటలను నెగెటివ్ గా తీసుకోవద్దు: నారా లోకేష్
అనంతపురం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నెగెటివ్ గా తీసుకోవద్దని, సానుకూలంగా తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ శ్రేణులకు ఆయన ఈ మేరకు సూచించారు. పవన్ కల్యాణ్ ఓ బాధ్యతగల వ్యక్తిగా సలహా ఇచ్చారని.. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని చెప్పారు. ప్రత్యేక హోదాకు అవకాశం ఏమాత్రం లేదని స్పష్టమైన తర్వాతే... దానికి సమానమైన ప్యాకేజీకి అంగీకరించామని తెలిపారు. ప్యాకేజీకి కూడా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా కోరుతున్నారని చెప్పారు. నిన్న రాత్రి విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. టీడీపీలో అవినీతి పెరిగిపోతోందన్న విమర్శలపై కూడా ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ఇప్పటికే దీనిపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు.