: పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
దేశంలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అంశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో మనసుపెట్టి ఆలోచించాలని ఆయన సూచించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులకి, రైతులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. కేంద్రం తీసుకున్న చర్యలతో రైతులకు వ్యవసాయంపైన వచ్చే ఆదాయంపై పన్ను ఉండదని ఆయన చెప్పారు. అంతేగాక, వారు తమ ఆదాయాన్ని బ్యాంకుల్లో జమచేయడం వల్ల వారికి వడ్డీ వస్తోందని చెప్పారు. ప్రజలు తమ డబ్బును ఇళ్లలోనే పెట్టుకుంటే వారు ఆ డబ్బు పోతుందేమో అని భయపడతారని, అలా కాకుండా బ్యాంకుల్లో జమచేసుకుంటే వారికి ఆ భయం ఉండదని జైట్లీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన విమర్శలపై జైట్లీ స్పందిస్తూ... చిదంబరం కాంగ్రెస్ హయాంలో మూడు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని, ఆ సమయంలో బ్లాక్‌మనీని నిరోధించేందుకు ఆయన ఏం చేశారో చెప్పాలని అన్నారు.