: పెళ్లికి వెళ్లాలి.. ఎక్కువ డబ్బులివ్వండంటూ అధికారులను బతిమాలాడు!
తన మిత్రుడి కూతురి పెళ్లికి వెళ్లాలని, తనకు కొంచెం ఎక్కువ డబ్బులివ్వండంటూ బ్యాంకు అధికారులను ఒక వ్యక్తి బ్రతిమలాడిన సంఘటన చెన్నైలో జరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో చెప్పడానికి తమిళనాడులో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. పెద్దనోట్లు మార్చుకునేందుకు చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎదుట చాలా మంది బారులు తీరారు. అందులో ఒక వ్యక్తి పెళ్లి కార్డుతో పాటు ఆ క్యూలో ఉన్నాడు. తన స్నేహితుడి కూతురు పెళ్లి రేపు జరుగుతుందని, ఈరోజు సాయంత్రం జరిగే పెళ్లి వేడుకకు తాను హాజరవ్వాలని, తనకు రూ.4 వేలు అధికంగా కావాలని, ఎక్కువ సంఖ్యలో పెద్దనోట్లు మార్చుకుంటానని కోరాడు. ఈ సందర్భంగా తన చేతిలోని శుభలేఖను అక్కడి అధికారులకు చూపించి బ్రతిమాలాడు. అయినప్పటికీ, అధికారులు స్పందించకపోవడంతో నిరాశ చెందిన అతను అక్కడి మీడియాతో తన ఆవేదనను పంచుకున్నాడు.