: హోదా ముగిసిన అధ్యాయమంటారు...ప్యాకేజీయే పరమావధి అంటున్నారు...ఏంటిది?: పవన్ కల్యాణ్


అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ ప్రారంభమైంది. గత రెండు బహిరంగ సభలకు భిన్నమైన వస్త్రధారణలో సభాప్రాంగణానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.... "అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఆడపడుచులందరికీ పేరుపేరునా నమస్కారం. 2014 ఎలక్షన్స్ సమయంలో మీ ముందుకు టీడీపీ, బీజేపీ తరపున ప్రచారానికి వచ్చాను. ఆరోజు మీ మద్దతు కోరాను. ఆరోజు మీరంతా నావెంట నిలిచారు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. సమస్యలొస్తే నేను ఎదురొడ్డి నిలబడే మనిషినే కానీ, పారిపోయే మనిషిని కాదు. వెనుకబడిన కరవు ప్రాంతమైన జిల్లా అనంతపురం. ఇలాంటి జిల్లాకు అండగా ఉండడం నాకు చాలా ఇష్టం. సరిహద్దులో పాకిస్థాన్ దేశం మనసైనికులపై దాడి చేసి చంపిన వెంటనే ఇలాంటి రాజకీయ సభపెట్టడం సరైన చర్య అని అనిపించలేదు. అందుకే నేను ఇంతవరకు బహిరంగ సభ ఏర్పాటు చేయలేదు. ఈ స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే, ఈ స్పెషల్ ప్యాకేజీ హార్వార్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్న వారు రాసిన ప్యాకేజీ. కనుక ప్రభుత్వ పాఠశాలలో గ్రేస్ మార్కులతో పాసైన నాకు దీనిని అర్ధం చేసుకునేందుకు ఈ మాత్రం సమయం పడుతుందని కొందరు అనుకోవాలి. మన దగ్గరకి ఓట్లడగడానికి వచ్చినప్పుడు రాజకీయనాయకులు చాలా సులువైన, సరళమైన భాష మాట్లాడతారు. గెలిచిన తరువాత మనకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చిన సమయంలో మాత్రం మనకు అర్థం కాని, నిరాశకు గురిచేసే భాష మాట్లాడతారు. అందుకే బాగా ఆలోచించి దీనిపై మాట్లాడుతున్నాను. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పలువురు నిపుణులతో చర్చించి మీ ముందుకు వచ్చాను. గతంలో ఈ ప్యాకేజీని పాచిపోయిన లడ్లు అన్నాను. పలువురు నిపుణులతో విశ్లేషించిన తరువాత ఈ ప్యాకేజీలో వారు కొత్తగా ఏమీ ఇవ్వలేదని నిర్ధారణకు వచ్చాను. ప్యాకేజీలో కొత్తగా ఏమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్యాకేజీ అద్భుతమని చెబుతున్నాయి. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయినవారున్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజీకి సన్మానాలు చేయించుకున్నవారున్నారు. ఏమన్నా అంటే స్పెషల్ స్టేటస్ పసరువేది కాదంటారు. డిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న మీకు స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం కావచ్చు, కానీ కరవు కోరల్లో చిక్కుకున్న జిల్లాల ప్రజలకు ఇది అమృతం చుక్క అన్నది మర్చిపోవద్దు. టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికానంటే కారణం అనంతపురంలాంటి జిల్లాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు ఆలోచించాను. అది జరగని రోజును జీ హూజూర్ అనే బానిసను మాత్రం కాదన్న విషయం తెలుసుకోండి. స్పెషల్ స్టేటస్ మీకు ముగిసిన అధ్యాయం కావచ్చు కానీ, దీనినుంచే సరికొత్త అధ్యాయాన్ని జనసేన ప్రారంభిస్తుందని గుర్తించండి. ఆశ్రయమిచ్చిన వారిని మోసం చేయకండి" అంటూ పవన్ ఆవేశంగా మాటలాడారు.

  • Loading...

More Telugu News