: తిరుపతిలో అంత‌్యక్రియలపై సైతం పెద్ద నోట్ల రద్దు ప్రభావం
నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలపై పడుతోంది. పెద్ద నోట్లు ఇస్తే తీసుకోబోమని అన్ని వ్యాపార కేంద్రాలు తేల్చిచెబుతుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం అంత‌్యక్రియలపై కూడా పడింది. తిరుపతి నగరంలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ఈ రోజు దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్ద నోట్లు చెల్లడం లేదని తమకు వంద, యాభై రూపాయల నోట్లు మాత్రమే ఇవ్వాలని కాటికాపరులు పట్టుబట్టడంతో అంత్యక్రియల పనులు ఆగిపోయాయి. దీంతో చెల్లని నోట్లతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన వారు అన్నారు. చివరకు శ్మశాన సిబ్బందికి స్థానికులు నచ్చజెప్పడంతో అంతిమ సంస్కారాలు ముగిశాయి.