: ఊదారంగు దుస్తుల్లో మెరుస్తూ, హుందాగా మాట్లాడిన హిల్లరీ... వోగ్, వ్యానిటీ ఫెయిర్ పొగడ్తలు
తన ఓటమిని అంగీకరిస్తూ, కాస్తంత బాధగా, అంతకుమించి హుందాగా మాట్లాడిన హిల్లరీ క్లింటన్ ను సోషల్ మీడియా పొగడ్తలతో ముంచెత్తుతుండగా, ఆమె మహిళల హక్కులకు ప్రతీకగా నిలిచారని వోగ్, వ్యానిటీ ఫెయిర్ వంటి మహిళా పత్రికలు కొనియాడాయి. గత రాత్రి తన అభిమానులు, డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన వేళ, ఆమె ఊదా రంగు (పర్పుల్) షర్ట్, జాకెట్, దానికి నప్పేలా అదే రంగు ల్యాపెల్స్ ధరించి రాగా, ఆమె భర్త బిల్ క్లింటన్ సైతం అదే రంగు టై ధరించి వచ్చారు. వీరిద్దరూ కావాలనే ఊదా రంగును ఎంచుకున్నారని, ఆమె ప్రత్యర్థి, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ పొరపాటున కూడా ఈ రంగును ధరించరని సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది అమెరికన్లు వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ రంగును యూఎస్, యూకేల్లో 'సుఫ్రాగెట్టీ పర్పుల్' అంటారు. సుఫ్రాగెట్టీ అనే పదం ఏవైనా ఉద్యమాల్లో మహిళలకు సమాన హక్కుల సాధనకు జరిపే ఉద్యమాల్లో పాల్గొన్న వారిని సూచిస్తుంది. సుఫ్రాగెట్టి జెండాలో సైతం ఊదారంగుతో పాటు తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయి. ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్) వర్గంలో ఊదారంగు ఉద్యమాలకు స్ఫూర్తి. ఇక ఈ రంగు దుస్తులు ధరించి వచ్చి కొద్దిపాటి కలకలాన్నే రేపిన హిల్లరీ జంట, 2008 ప్రాంతంలో బిల్ క్లింటన్ చేసిన వ్యాఖ్యలను హిల్లరీ గుర్తు చేసుకున్నారు. ఓ మహిళ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అత్యంత క్లిష్టమైన అంశమని నాడు క్లింటన్ వ్యాఖ్యానించగా, దాన్ని హిల్లరీ గుర్తు చేసుకున్నారు. తాను మహిళల హక్కుల పరిరక్షణకు నిత్యమూ పోరాటం చేస్తుంటాననే చెప్పారు. ఇక ట్రంప్ మాదిరిగా కాకుండా, హుందాగా మహిళల కోసం శ్రమిస్తానన్న సంకేతాలు పంపిన హిల్లరీ ప్రసంగంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.