: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్
రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల జీవించే హక్కును హరిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పాత నోట్లను తొలగించే క్రమంలో, కేంద్ర ప్రభుత్వం సహజమైన న్యాయ సూత్రాలను పాటించలేదని, రాజ్యాంగ సమన్యాయ విధానాన్ని ఆచరించలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల దైనందిన జీవితంలో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. వ్యాపారాలపై కూడా దీని ప్రభావం పడిందని ఆరోపించారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇదే విషయంపై యూపీకి చెందిన లాయర్ సంగంలాల్ పాండే కూడా పిటిషన్ వేశారు.