: అనంతలో పవన్ కల్యాణ్ ఫీవర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం 4 గంటల సమయంలో అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుండగా, ఉదయం నుంచే సందడి మొదలైంది. ఈ మేరకు జనసేన నేతలు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయగా, ఇప్పటి నుంచే అభిమానులు కళాశాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణ వ్యాప్తంగా పవన్ ఫీవర్ నెలకొంది. కాగా, సభా వేదికకు కల్లూరు సుబ్బారావు పేరు, మైదానానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టారు. వీఐపీలకు ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేశారు. ఎప్పటిలానే సభా వేదికపై పవన్ కల్యాణ్ ఒకరే ఉంటారని తెలుస్తోంది. మైదానంలో రెండు, బయట మూడు పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఇక ఈ సభా వేదికకు వెళ్లేందుకు నాలుగు దారులుండగా, ప్రధాన రహదారిని వీఐపీల కోసం కేటాయించారు. మిగతా గేట్లు అభిమానులు, కార్యకర్తల కోసం కేటాయించారు. సభ ముగియగానే కార్యకర్తలు వెంటనే ఆర్టీసీ బస్టాండ్ చేరుకునేందుకు కూడా ఓ గేటుంది. మొత్తం 800 పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించిన పోలీసు శాఖ, మరో 300 మందిని రిజర్వులో ఉంచింది. పవన్ బస చేసే హోటల్ నుంచి సభా మైదానం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.