: సిబిఐ స్వతంత్రతను పునరుద్దరించాల్సిందే: సుప్రీంకోర్టు
బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు వివరాలను సిబిఐ రాజకీయ నేతలు, ప్రభుత్వంతో పంచుకోవడంపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. దీనివల్ల దర్యాప్తు బలహీనపడిందని వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి సిబిఐ డైరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్ ను సుప్రీంకోర్టు ఈ రోజు పరిశీలించింది. ఇది గందరగోళంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వంతో దర్యాప్తు వివరాలను పంచుకున్న విషయాన్ని ముందుగా సిబిఐ, కోర్టుకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. సిబిఐ దర్యాప్తులో రాజకీయ జోక్యానికి తావుండరాదని, స్వయం ప్రతిపత్తిని కల్పించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు తమ వంతు ప్రయత్నిస్తామని చెప్పింది. దర్యాప్తులో రాజకీయ నాయకుల సూచనలను తీసుకోవాల్సిన అగత్యం లేదని సిబిఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
అసలు ఏ నిబంధనల మేరకు బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరిపారో తెలియజేయాలని, అలాగే నివేదికను ప్రభుత్వంతో పంచుకున్న విషయంపై మే 6 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది.