: 2000 నోట్లలో చిప్ లేదు... అవన్నీ ఒట్టి పుకార్లే: ఆర్బీఐ స్పష్టీకరణ
500, 1000 రూపాయలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేయనున్నామని ప్రధాని మోదీ, ఆర్బీఐ ప్రకటించిన నాటి నుంచి దేశంలోని అన్ని సామాజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ వైరల్ అయింది. ఆ మెసేజ్ తో విద్యావంతులంతా ముందుగా ఆశ్చర్యం వ్యక్తం చేసినా, నిజమేనేమో అన్న శంకతో వారు దానిని షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఆ మెసేజ్ లో ఎలాంటి వాస్తవం లేదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. ఆ మెసేజ్ వివరాల్లోకి వెళ్తే... ఆర్బీఐ 2000 రూపాయల నోటును సరికొత్త నానో టెక్నాలజీ పేపర్ తో తయారు చేసిందనీ, ఈ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల నోటు సిగ్నల్స్ వెదజల్లుతుందని, వాటిని నేరుగా శాటిలైట్ క్యాచ్ చేస్తుందని, దీంతో ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయం ఈ నోటును తయారు చేసిన ఆర్బీఐకి తెలిసిపోతుందని పేర్కొంటున్నారు. మరి కొందరు ఆ మెసేజ్ కు మరిన్ని మషాలాలు దట్టించి, ఈ నోటులో కంటికి కనిపించని కెమెరా కూడా ఉంటుందని పుకార్లు రేపుతున్నారు. ఇవి ఆర్బీఐ వరకు చేరడంతో వీటిపై వివరణ ఇచ్చింది. ఇవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. వాటిని నమ్మవద్దని తెలిపింది. దీంతో ఈ నోటుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ వెల్లడించింది.