: 1978 నాటి పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చి చూడకూడదు: పెద్దనోట్ల రద్దుపై జైట్లీ
నల్లధనానికి, నకిలీ నోట్లకు పెద్ద నోట్ల రద్దు ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పరచి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రెండు రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని జైట్లీ అన్నారు. కేంద్ర నిర్ణయంతో పన్నుల వసూళ్లు పెరుగుతాయని చెప్పారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టానికి, నల్లధనానికి చెక్ పెట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నల్లధనం వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని, అవినీతి నిరోధానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, ఆర్థిక సంస్కరణలకు కృషి చేస్తోన్న కేంద్రం నిర్ణయాల వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని చెప్పారు. ప్రతిపక్షాలు దీనిపై కామెంట్ చేసే ముందు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. 1978 నాటి పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చిచూడకూడదని, అప్పటి ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వ్యవస్థకు తేడా ఉందని జైట్లీ చెప్పారు. కేంద్ర నిర్ణయం దేశంలోని అవినీతి పరులకు మాత్రమే నష్టమని స్పష్టం చేశారు. నల్ల బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన అవసరం లేదని చెప్పారు.