: ‘పెద్ద నోట్లు స్వీకరించబడవు’ అంటూ ఏకంగా నోటీసు బోర్డు
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్లను పట్టుకొని వస్తోన్న వినియోగదారులకు అన్ని షాపింగ్ మాల్స్, సంస్థలు దండం పెట్టిపంపించేస్తున్నాయి. ఆసుపత్రులు, పెట్రోల్ బంక్ లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో పెద్దనోట్లు వినియోగించవచ్చని కేంద్రం ప్రకటించినా ఆయా ప్రదేశాల్లో నోట్లను సిబ్బంది తీసుకోవడం లేదు. ఈ ప్రదేశాల్లోనే కాక పలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కూడా సిబ్బంది పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు పెట్రోల్ బంక్ ల్లోనూ ఇస్తే చిల్లర ఇవ్వాలని, లేదంటే రూ.500 ఇచ్చి పెట్రోల్ పోయించుకోవాలని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ రైల్వేస్టేషన్‌లో అధికారులు ఏకంగా ఈ పరిస్థితిపై నోటీసు పెట్టేశారు. తాము 500, 1000 నోట్లను తీసుకోబోమని నోటీసు బోర్డులో పేర్కొన్నారు.