: పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమకు పెద్ద షాక్... బడా హీరోలు, దర్శకులు, నిర్మాతల పరిస్థితేంటి?
500, 1000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, భోజ్ పురీ, పంజాబీ, బెంగాలీ, మరాఠా సినీ పరిశ్రమలను గట్టి దెబ్బే కొట్టారు. సాధారణంగా సినీ నిర్మాణంలో బ్లాక్ మనీది కీలక పాత్ర అన్న విషయం బహిరంగ రహస్యమే. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణంలో బ్లాక్ మనీది మరింత పెద్ద పాత్ర. అలాగే హక్కులు, డిస్ట్రిబ్యూషన్, రెమ్యూనరేషన్ వివాదాల సందర్భంలో సినీ పరిశ్రమలో నడిచే దందాల గురించి బాహ్యప్రపంచానికి పలు విషయాలు తెలుస్తుంటాయి. ప్రధానంగా సినీ నిర్మాణం సమయంలో ఫైనాన్షియర్ల నుంచి డబ్బులు తీసుకుని సినిమాలు నిర్మించడం అనేది ఇంచుమించుగా దందా అని సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. అందుకే స్టార్ ల రెమ్యూనరేషన్ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతుంటారు. మరి కొందరు స్టార్లు తమ రెమ్యూనరేషన్లను ఏరియా హక్కుల రూపంలో తీసుకుంటుంటారు. ఈ లెక్కలన్నీ ఎంత పారదర్శకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాగే పెద్దపెద్ద సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కూడా కాకిలెక్కలు చూపుతాయన్న ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వీరంతా తమ బ్లాక్ మనీని పెద్ద నోట్లలోనే దాచుకుంటారన్న సంగతి విదితమే. దీంతో మోదీ నిర్ణయం సినీ పరిశ్రమను శరాఘాతంలా తగిలింది. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్న సినీ పరిశ్రమ బడా వ్యక్తులు లోలోపల తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం.