: హైదరాబాద్‌లో ఆర్‌బీఐ శాఖ ముందే చెట్టు కింద పాత నోట్ల మార్పిడి దందా!
దేశ వ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లు చెల్లకపోతుండడంతో సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లో సామాన్యులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను పట్టకుని దళారుల వద్దకు క్యూ కడుతున్నారు. నగరంలోని సెక్రటేరియట్ రోడ్డు వద్ద ఉన్న ఆర్‌బీఐ శాఖ ముందు ఓ చెట్టు కింద పాత నోట్ల మార్పిడి దందా కొనసాగుతోంది. చిల్లరను బ్యాగులో తీసుకొచ్చిన దళారులు రూ.500కి 100 రూపాయల కమీషన్‌తో చిల్లర ఇస్తున్నారు. వంద, యాభై రూపాయల నోట్లతో పాటు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల కాయిన్‌లు కూడా ఇస్తూ మీడియాకు కనపడ్డారు. అయితే, నోట్ల మార్పిడి అంశంపై సామాన్యులకు ఏ మాత్రం అవగాహన లేనట్టు కనపడుతోంది. ఆర్‌బీఐలో తమ పెద్ద నోట్లను మార్చుకోవచ్చని అక్కడకు వందల మంది సామాన్య ప్రజలు వస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడిన తీరుని చూస్తుంటే వారిలో ఎంత అమాయకత్వం ఉందో తెలుస్తోంది. ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ... 500, 1000 రూపాయల నోట్లు చెల్లడం లేదని, ఈ రోజులోపు మార్చుకోకపోతే తమ నోట్లు ఇక చెల్లవని వ్యాఖ్యానించాడు. అందుకే తాము దళారులకు 100 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకుంటున్నానని అన్నాడు. మరోవైపు ఇంటికి వెళుతూ ఓ దళారి మీడియాతో మాట్లాడుతూ తాను తెచ్చిన చిల్లర అంతా అయిపోయిందని చెప్పాడు. సామాన్యులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లపై ఆందోళన చెందకూడదని, వారి డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని, రేపటి నుంచి బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.