: కోహ్లీ సేనకు ఇంగ్లండ్ జట్టుపై విజయం సాధ్యమేనా?


టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి రాజ్ కోట్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో విజయంపై రెండు జట్లు ధీమాగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ వరుస విజయాలతో కెప్టెన్ గా ఇప్పటికే నిరూపించుకుని, సరికొత్త సవాల్ కోసం సిద్ధంగా ఉండగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా కుక్ కు ఇదే చివరి సిరీస్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య సిరీస్ హోరాహోరీ జరగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ పై సత్తాచాటి భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లిష్ జట్టుకు భారత్ లో మంచి రికార్డు ఉంది. గతంలో టీమిండియాకు చుక్కలు చూపించిన ఘనత ఇంగ్లండ్ జట్టుకే ఉంది. దీంతో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. దీనిపై దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, కోహ్లీ సేన చేతిలో ఇంగ్లండ్‌ కు వైట్ వాష్ తప్పదన్నాడు. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల జట్ల రికార్డులను ఓసారి పరికిస్తే ఇంగ్లండ్ రికార్డు బాగుంది. 2000 నుంచి ఇప్పటి వరకు భారత్ కు వచ్చిన దేశాల్లో ఇంగ్లండ్ జట్టు ఉత్తమమైనదని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే గత దశాబ్ద కాలంలో సొంతగడ్డపై భారత్‌ ను ఓడించగలిగిన జట్టు కూడా ఇంగ్లండేనని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ సిరీస్ రెండు జట్ల మధ్య పసందైన క్రీడా విందునందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News