: మేమేమీ నిబంధనలు అతిక్రమించి సినిమా రూపొందించలేదు...భయమెందుకు?: ఫర్హాన్ అఖ్తర్


తాము చట్టాలను ఉల్లంఘించి సినిమా రూపొందించలేదు కనుక, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అఖ్తర్ తెలిపాడు. పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన నేపథ్యంలో రయీస్ ను విడుదల చేస్తారా? లేదా కరణ్ జొహర్ లా ఎమ్మెన్నెస్ తో ఒప్పందం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఫర్హాన్, ‘రయీస్’ను అనుకున్న సమయానికే ధైర్యంగా విడుదల చేస్తామని అన్నాడు. ‘రయీస్’లో షారూక్ ఖాన్ సరసన పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు, చట్టాలు ఉల్లంఘిస్తే భయపడాల్సిన అవసరం ఉంటుందని, తాము అలాంటి పనులేవీ చేయలేదని స్పష్టం చేశాడు. దీని గురించి అంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదని అన్నాడు. సహ నిర్మాత రితేశ్ సిధ్వానీ మాట్లాడుతూ, సినిమా విడుదల గురించే ఆలోచిస్తున్నామని, అది మినహా మరింకే విషయం గురించి ఆలోచించడం లేదని అన్నాడు. త్వరలో ట్రైలర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపాడు.

  • Loading...

More Telugu News