: జెట్ ఎయిర్‌వేస్ విమానంలో విషాదం.. ప్రయాణంలో కన్నుమూసిన ప్రయాణికుడు
ఢిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ ప్రయాణికుడు కన్నుమూశాడు. 141 మంది ప్రయాణికులతో నిన్న రాత్రి బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది అతడికి వైద్యం అందించడం కోసం విమానాన్ని కరాచీకి మళ్లించారు. ముందస్తు సమాచారం ఇవ్వడంతో అక్కడి ఎయిర్‌పోర్టులో కూడా ప్రయాణికుడికి వైద్య సహాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, అక్కడకు చేరుకునేలోపే ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుడి మృతదేహాన్ని అధికారులకు అప్పగించనున్నామని, అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది.