: సమాజ్ వాదీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయం... అఖిలేష్ తో ప్రశాంత్ కిశోర్ రహస్య సమావేశం!
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇరు పార్టీల మధ్యా పొత్తు మంత్రాంగాన్ని నడిపి విజయవంతమైనట్టు సమాచారం. ఇప్పటికే సమాజ్ వాదీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ తో సోమవారం నాడు చర్చించిన ప్రశాంత్, ఆపై అఖిలేష్ యాదవ్ తో రహస్యంగా సమావేశమయ్యారు. ఓ మహా కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మాత్రమే బీజేపీని ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా తండ్రీ కొడుకులకు ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఏర్పాటై ఆపై విడిపోయిన జనతా పరివార్ లోని పార్టీలనే మరోసారి కలుపుకుని 'మహా ఘటబంధన్' ఏర్పరచి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీలు భావిస్తున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, మరికొంత కాలం వేచిచూసే ధోరణిలో ఉంటారన్నట్టుగా అఖిలేష్ వైఖరి కనిపించగా, ప్రశాంత్ కిశోర్ స్వయంగా వచ్చి మాట్లాడిన తరువాత ఆయన మనసు మారినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ నిర్ణయమైనా పార్టీ జాతీయ అధ్యక్షుడు తీసుకుంటారని స్పష్టం చేశారు. గెలుపోటములు, విజయావకాశాలను పరిశీలించిన మీదటే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.