: మహిళపై అసభ్యకర కరపత్రాలు ముద్రించి పంచిన వ్యక్తి.. అరెస్ట్
తాను ఒంటరిగా ఉన్నానని, ఎవరైనా తనతో గడపాలనుకుంటే ఈ చిరునామాలో సంప్రదించవచ్చంటూ మహిళను అభాసుపాలు చేసేలా కరపత్రాలు ముద్రించి పంచిపెట్టిన వ్యక్తిని హైదరాబాదు, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేటలో నివాసముండే ఓ వివాహిత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. నాలుగు నెలల క్రితం ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె సన్నిహితంగా ఉండే వ్యక్తిని పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆగ్రహంతో ఉన్న అతడు మహిళపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే అసభ్యకరంగా కరపత్రాలు ముద్రించి ఆమె నివసిస్తున్న ప్రాంతంలో పంచిపెట్టాడు. వీటిని చూసిన కొందరు మహిళకు విషయం తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కరపత్రాలు పంచిన నిందితుడితోపాటు వాటిని ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.