: హద్దుమీరిన తాజ్ డైరెక్టర్ల 'స్వతంత్రత'ను ప్రశ్నించనున్న టాటాలు
టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత, గ్రూపు సంస్థల్లో భాగమైన ఇండియన్ హోటల్స్ లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్న కొందరు మిస్త్రీని వెనకేసుకుని రావడాన్ని రతన్ టాటా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. గత శుక్రవారం సమావేశమైన ఇండియన్ హోటల్స్ లిమిటెడ్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు మిస్త్రీపై నమ్మకాన్ని కొనసాగిస్తామన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై వారి 'స్వతంత్రత'పై విచారణ జరిపించాలని టాటాలు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పుడిక వారు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ నుంచి తాము ఏ విధమైన ప్రోత్సాహకాలూ తీసుకోలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుందని టాటా వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు చెబుతూ, మిస్త్రీపై వారు పూర్తి నమ్మకాన్ని ఉంచారని, ఈ విషయంలో ఐహెచ్సీఎల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకోనున్నామని టాటా సన్స్ తెలిపింది. ఇక ఇండియన్ హౌటల్స్ లో ఉన్న ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లూ, మిస్త్రీని తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి, సంస్థ భవిష్యత్తుపై అనుమానాలు పుట్టించేలా ఎందుకు మాట్లాడారన్న విషయమై ప్రశ్నించనునట్టు టాటా ట్రస్ట్స్ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు.