: స్వామి వారు తన సొంత జీవితాన్ని త్యాగం చేసి, సమాజం కోసం ఆదర్శమూర్తిగా మారారు!: వెంకయ్యనాయుడు


‘స్వామి వారికి జరుపుతున్న షష్టి పూర్తి ఉత్సవం ఆయన్ని అభినందించడానికి కాదు. వారిని చూపించి మనందరం స్ఫూర్తిని పొందడానికి’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఎల్బీ స్టేడియంలో త్రిదండి చినజీయర్ స్వామి షష్టి పూర్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ చెబుతుంటాను. ఫెలిసిటేషన్ ఈజ్ ఫర్ ఇన్ స్పిరేషన్. మనందరిలో అణగారి ఉన్నటువంటి భక్తిని, ప్రపత్తిని వారి యొక్క ప్రేరణ ద్వారా మనం పొంది, మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకానీ, స్వామి వారికి ఈ ఉత్సవం చేయాల్సిన అవసరం లేదు. స్వామి వారు తన సొంత జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసి, సమాజ శ్రేయస్సు కోసం ఆదర్శమూర్తిగా మారారు’ అని అన్నారు. ఈ సందర్భంగా సంస్కృతి గురించి ఒక వ్యక్తి తనకు అర్థమయ్యేలా చెప్పమన్నాడని.. ‘జీవనపద్ధతి’ అని చెబితే ఆ వ్యక్తికి అర్థం కాలేదన్నారు. ‘ఇంకా అర్థమయ్యేలా’ చెప్పాలని కోరాడు. అప్పుడు నేనేం చెప్పానంటే.. ‘నీ రొట్టెను నువ్వు తింటే ప్రకృతి. పక్కవాడి రొట్టెను లాక్కొని తింటే వికృతి. నీ రొట్టెను పక్కవాడికి పంచి ఇస్తే సంస్కృతి. అదేరా బాబు సంస్కృతి అని చెప్పాను’ అంటూ వెంకయ్యనాయుడు తన దైనశైలిలో ప్రసంగించారు.

  • Loading...

More Telugu News