: ఇంజక్షన్ వికటించి బాలింత మృతి...కూకట్ పల్లి ఓమ్నీ ఆసుపత్రి వద్ద ఆందోళన
ఇంజక్షన్ వికటించడంతో బాలింత మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ లో జరిగింది. జగద్గిరి గుట్టకు చెందిన బాలింత స్రవంతి ఆరోగ్య సమస్యల నిమిత్తం వారం రోజుల క్రితం కూకట్ పల్లిలోని ఓమ్నీ ఆసుపత్రిలో చేరింది. గత వారం రోజులుగా స్రవంతికి వైద్య సేవలు చేశారు. ఈ క్రమంలో ఆమెను డిశ్చార్జి చేస్తామని నిన్న వైద్యులు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె చనిపోయింది. అయితే, డిశ్చార్జికి ముందు స్రవంతికి పెన్సిలిన్ ఇంజెక్షన్ చేశారని, ఆ ఇంజెక్షన్ వికటించడంతో ఆమె ప్రాణాలు వదిలిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్రవంతి బంధువులు ఆందోళనకు దిగారు. ఆరు రోజుల శిశువుతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రిపై దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కాగా, స్రవంతికి సరైన వైద్య చికిత్స అందించామని, వైద్యుల నిర్లక్ష్యం చేయలేదని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. కావాలంటే తమపై కేసు పెట్టుకోండంటూ ఓమ్ని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ నగేష్ చెప్పడం గమనార్హం.