: ప్రభుత్వ అధికారులపై కోపంతో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన వ్యక్తి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఓ వ్యక్తి విసుగెత్తిపోయి తన పని పూర్తికాలేదంటూ పాకిస్థాన్ జెండా ఎగరవేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాను ఎంతో కాలంగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నానని, అయితే తాను కట్టాల్సిన పన్ను కన్నా అధికంగా కడుతున్నానని నెహ్రూనగర్‌లోని సీసామావులో నివసించే చంద్రపాల్ సింగ్ అనే వ్యక్తి భావించాడు. కాన్పూర్ నగరపాలక సంస్థ అధికారులు ఇంటిపన్ను, నీటిపన్నులను తనతో కట్టించుకుంటున్నారని, తాను కడుతున్న పన్నులపై తనకు వివరణ ఇవ్వాలని, పన్ను గురించి కచ్చితంగా నిర్ధారించి చెప్పమని సర్కారీ ఆఫీసుల చుట్టూ ఎనిమిదేళ్లుగా తిరిగాడు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ జెండా ఎగరేశాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి, పాకిస్థాన్ జెండాను ఇంట్లో ఉంచుకున్నాడని, మతం పేరిట సమాజంలోని పలు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపిస్తున్నాడని కేసులు పెట్టారు. అయితే తాను అధికారులకు తన సమస్యను చెప్పే ప్రయత్నంలో వారి దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఈ పనిచేశానని చెబుతున్నాడు.