: బిగ్ బీ గురించి ఆరా తీసిన హిల్లరీ!
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ గురించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమొక్రాటిక్ అభ్యర్థి గతంలో ఆరా తీశారట. హిల్లరీ ఈ-మెయిళ్ల వ్యవహారం ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఈ-మెయిల్ కు సంబంధించిన ఒక ఫొటోను ‘వాషింగ్టన్ పోస్ట్’ పొలిటికల్ రిపోర్టరు జోస్ ఏ డెల్ రీల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సంతతికి చెందిన హుమా అబేదిన్ కు 2011 జులై లో పంపిన మెయిల్ లో హిల్లరీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘కొన్నేళ్ల క్రితం మనం కలిసిన ప్రముఖ భారతీయ నటుడి పేరేంటి?’ అని ఆ మెయిల్ లో హిల్లరీ ప్రశ్నించగా, ‘అమితాబ్ బచ్చన్’ అని హుమా అబేదిన్ సమాధానమిచ్చినట్లు డెల్ రీల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే, అమితాబ్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందనే వివరాలు హిల్లరీ ఈ-మెయిల్ లో లేకపోవడం గమనార్హం.