: తిరుమల శ్రీవారి నామాల ఆకృతిని మార్చారంటూ రమణ దీక్షితులుపై ఫిర్యాదు!
తిరుమల శ్రీవారి ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. శ్రీవారి నామాలను మార్చారని ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై జియ్యంగార్లు ఫిర్యాదు చేశారు. దీంతో, జియ్యంగార్లు, అర్చకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏడుకొండల వాడికి ‘వీ’ ఆకృతికి బదులుగా ‘యు’ ఆకృతి నామం వేశారని ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులను వివరణ కోరే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆలయ అధికారి రామారావు మాట్లాడుతూ, ఈ విషయమై జియ్యంగార్లు లిఖితపూర్వకంగా రమణ దీక్షితులపై ఫిర్యాదు చేస్తే ఆయనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి గర్భాలయంలోకి రమణ దీక్షితులు తన మనవడిని తీసుకువెళ్లారని, ఆగమశాస్త్ర నియమాలకు ఇది విరుద్ధమని విమర్శలు తలెత్తడం తెలిసిందే. తాజాగా, ఆయనపైనే ఈ ఆరోపణలు తలెత్తడం గమనార్హం.