: పాక్ దుర్మార్గపు పైఎత్తుతో 8 మంది అధికారులకు ప్రాణాపాయం: భారత్
ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది భారత హై కమిషన్ అధికారులు పాక్ కు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించడం పూర్తి నిరాధారమని భారత్ ప్రకటించింది. ఢిల్లీలో పాక్ గూఢచారిని సాక్ష్యాధారాలు సహా పట్టుకున్న తరువాత అతన్ని దేశం నుంచి బయటకు పంపిస్తే, దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం పాక్ వేసిన దుర్మార్గపు పైఎత్తులో భాగమే ఈ ఆరోపణలని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. కేవలం ఒక్క పాక్ జాతీయుడినే భారత్ బహిష్కరించిందని గుర్తు చేసిన ఆయన, పాక్ ఎనిమిది మంది భారత ఉద్యోగుల గుర్తింపును బహిర్గతం చేసిందని, దీని వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడటంతోనే వారందరినీ వెనక్కు పిలిపించాలని కేంద్రం నిర్ణయించిందని అన్నారు. కనీస ద్వైపాక్షిక నిబంధనలను పట్టించుకోకుండా పాక్ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ లో ఉన్న భారత ఉద్యోగులు, వారి కుటుంబీకులందరి రక్షణ బాధ్యత ఆ దేశానిదేనని ఆయన స్పష్టం చేశారు.