: సొంత ఛానల్ పెట్టనున్న ఆర్నబ్ గోస్వామి?
ప్రముఖ వార్తావిశ్లేషకుడు ఆర్నబ్ గోస్వామి 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ ఛీప్ పదవి నుంచి తప్పుకున్నారు. వీడ్కోలు సమయంలో ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు లీక్ అయింది. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో ఆన్ లైన్ లో బాగా షేర్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా స్వేచ్ఛపై నమ్మకం కోల్పోవద్దంటూ తన సహచరులకు ఆర్నబ్ సూచించారు. తాను ఇంత స్వేచ్ఛగా పని చేయడానికి కారణం మీరే అని ఆయన అన్నారు. ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరని... మనకు మనమే నేర్చుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగానే కొంత మందిపై తాను నోరు పారేసుకున్నానని... వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. టౌమ్స్ నౌ ఛానల్ ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికే తాను అలా వ్యవహరించానని చెప్పారు. 'ది న్యూస్ అవర్' కార్యక్రమంతో ఆర్నబ్ చాలా పాప్యులర్ అయ్యారు. దాదాపు పదేళ్ల పాటు ఆ ఛానల్ కి పనిచేశారు. మరోవైపు ఆర్నబ్ గోస్వామి సొంత ఛానల్ పెట్టనున్నారని తెలుస్తోంది.