: 34 రోజుల్లో 300 సార్లు కాల్పులు జరిపిన పాకిస్థాన్
పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ సైన్యం అక్టోబర్ 29 నుంచి గడచిన 34 రోజుల వ్యవధిలో 300 సార్లు భారత్ వైపు కాల్పులు జరిపినట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. సైనికులతో పాటు సమీప గ్రామాల్లోని అమాయకులు, పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోందని ఓ అధికారి తెలిపారు. సైన్యం, సరిహద్దు భద్రతా జవాన్లతో పాటు, గ్రామాల్లోని పౌరులనూ వదిలిపెట్టవద్దని పాక్ సైన్యానికి ఆదేశాలు అందినట్టుగా తమకు సమాచారం ఉందని, గడచిన ఐదు వారాల్లో పశ్చిమ ప్రాంత సరిహద్దుల్లో 500 మార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన జరుగగా, వీటిల్లో మూడింట రెండు వంతులు పౌరులు లక్ష్యంగా సాగాయని తెలిపారు. ఈ సరిహద్దు కాల్పుల హడావుడిలో ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడేలా చూడాలన్న పాక్ పన్నాగాలకు కూడా తాము అడ్డుకట్ట వేశామని అన్నారు.