: 'నిపట్ దో సబ్ కో'... బతికున్న వాళ్లనూ కాల్చి చంపాలని వాకీటాకీ ఆదేశాలు... సిమీ ఎన్ కౌంటర్ లో కొత్త కోణం!
గత వారంలో భోపాల్ శివారులో జరిగిన 8 మంది సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన తాజా ఆడియో ఒకటి బయట పడింది. ఇందులో వాకీటాకీ సంభాషణ ఉంది. తమ కాల్పుల్లో ఐదుగురు మరణించారన్న సమాచారాన్ని ఓ పోలీసు ఉన్నతాధికారులకు చేరవేయగా, అందరినీ చంపాలన్న ఆదేశాలు వచ్చాయి. 'పాంచ్ తో మార్ గయే' (ఐదుగురు మరణించారు) అన్న గొంతు తొలుత వినిపించగా, 'సిపట్ దో సబ్ కో' (అందరినీ చంపేయండి) అన్న సమాధానం వచ్చింది. ఆపై ముగ్గురింకా బతికే వున్నారని, వాళ్లను కాల్చాల్సి వుందని ఓ గొంతు వినిపిస్తుండగా, కొన్ని సెకన్ల తరువాత తుపాకి తూటాల చప్పుడు, ఆపై 'సార్ బదాయి హో ఆటోం మార్ గయే' (సార్ అభినందనలు. ఎనిమిది మందీ మరణించారు) అని చెప్పగా, 'వెరీ గుడ్, మేం అక్కడికి వస్తున్నాం' అన్న అధికారి గొంతు వినిపించింది. ఈ ఎన్ కౌంటర్ తప్పుడు ఎన్ కౌంటర్ అని, నిరాయుధులను తీసుకెళ్లి కాల్చి చంపారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆడియో టేపులు విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి.