: అఖిలేష్ లేకుండా పొత్తు అసంభవం... ములాయంకు స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, అన్ని పార్టీలనూ కలిపి 'మహాఘటబంధం' ఏర్పరచి బీజేపీని, మాయావతిని నిలువరించి, తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ములాయం సింగ్ కు కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల నుంచి గట్టి షరతు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీలో చీలికలు వస్తున్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ, అఖిలేష్ కలసి వస్తేనే తాము మహాఘటబంధంలో భాగమవుతామని అటు కాంగ్రెస్, ఇటు ఆర్ఎల్డీలు స్పష్టం చేశాయి. సమాజ్ వాదీ పార్టీ నేతగా అఖిలేష్ ఉండాలని, అప్పుడు మాత్రమే కాంగ్రెస్ కలిసొస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ములాయం ఇంట విభేదాలు కొనసాగుతూ, రెండు పార్టీలుగా విడిపోయి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉంటే ఎంతమాత్రమూ వారితో కలిసేది లేదని తమ పార్టీ చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేసినట్టు ఆర్ఎల్డీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇదిలావుండగా, మహాఘటబంధనంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి విజయవంతమై తిరిగి అధికారాన్ని పొందాలంటే, సమాజ్ వాదీ, బీఎస్పీలు కలసిరావాలని, ములాయం, మాయావతి ఓ వైపు నిలిస్తేనే, బీజేపీని సులువుగా ఓడించి, తిరిగి అధికారాన్ని పొందవచ్చని ఆయన అనడం గమనార్హం.