: హిల్లరీ క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది: ట్రంప్
దేశాధ్యక్షుడి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అమెరికా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా హిల్లరీ క్లింటన్ పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈమెయిల్స్ వ్యవహారంలో చేసిన తప్పిదాలకు గాను హిల్లరీ క్లింటన్ క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 65వేల ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని... ఈ విషయం ఎఫ్బీఐ దర్యాప్తులో వెలుగుచూసిందని చెప్పారు. వీరు చేసిన పనికి మొత్తం అమెరికన్లు అంతా బాధితులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విఫలమైన ఓ నాయకురాలికి ఎవరైనా మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. హిల్లరీ గత తరం నాయకురాలని... అమెరికా భవిష్యత్తును కోరుకునే వారు తన వెంట నిలబడాలని పిలుపునిచ్చారు. ఎఫ్బీఐతో పాటు అమెరికా కాంగ్రెస్ కు కూడా హిల్లరీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు.