: మోదీజీ.. ప్రపంచమంతా పర్యటించే మీరు, మా గ్రామాలకు రాలేరా?: మల్కన్ గిరి బాలుడి లేఖ
‘మోదీజీ.. ప్రపంచమంతా పర్యటించే మీరు, మా గ్రామానికి రాలేరా?’ అంటూ ఒడిశాలోని మల్కన్ గిరి ప్రాంతానికి చెందిన ఒక బాలుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. పదేళ్ల ఆ బాలుడి పేరు ఉమేస్ మాది. నాల్గోతరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఈ లేఖ రాయడానికి ప్రధాన కారణం గిరిజన గ్రామాల్లోని చిన్నారులు మెదడు వాపు వ్యాధి బారిన పడుతుండటం. ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా తన మిత్రులు చనిపోయారని ఆ లేఖలో బాలుడు తెలిపాడు. మల్కన్ గిరిలోని 505 గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు 73 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని పేర్కొన్నాడు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకునే విషయంలో ప్రధాని సాయం కావాలని కోరాడు. ఇదిలా ఉండగా, మల్కన్ గిరి ప్రత్యేక అధికారి నృపరాజ్ సాహు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మెదడు వాపు వ్యాధి నివారణకు జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టిందని, అయినప్పటికీ, అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదని అన్నారు.